విశాఖపట్నం వేదికగా నిర్వహించిన 51వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి యోగా స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్–2026 పోటీల్లో ఆదోని పట్టణానికి చెందిన నిథాలి డి. జైన్ అద్భుత ప్రతిభ కనబరిచింది. ఆగస్టు 29న జరిగిన ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులతో పోటీపడి నిథాలి రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించింది. ఆగస్టు 30న ప్రకటించిన ఫలితాల ప్రకారం, ఆమె ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి పోటీలకు అధికారికంగా ఎంపికైంది.స్థానిక లీలాస్ పాఠశాల (Leela’s Patashala) లో 6 తరగతి చదువుతున్న విద్యార్థిని నిథాలి, పట్టణంలోని మహావీర్ డిజిటల్స్ అధినేత దినేష్ భరత్ షా కుమార్తె. చిన్న వయసులోనే యోగాలో కఠినమైన ఆసనాలను చక్కగా ప్రదర్శించి న్యాయనిర్ణేతల ప్రశంసలు అందుకుంది.

జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన నిథాలిని పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, పలువురు పట్టణ ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు. రాబోయే జాతీయ స్థాయి పోటీల్లో కూడా ఆమె ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి, ఆదోని పట్టణానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
