కర్నూలు జిల్లా ఆదోని మండలం పరిధిలోని మాదిరే గ్రామ క్రాస్ సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా బలంగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

లింగాల్ దాల్ గ్రామానికి చెందిన జోషబ్ (18), కంపాడు బాపురం గ్రామానికి చెందిన శివరమిరెడ్డి (55) ఇద్దరు మృతి చెందారు. అదోనికి చెందిన అయూబ్, లింగాల్ దాల్ గ్రామానికి చెందిన మోహన్ ఇద్దరికి తీవ్రగాయాలు పరిస్థితి విషమంగా వుండడంతో బంధువులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగాల్దాల్ గ్రామానికి చెందిన జోషబ్ (18), మోహన్ ఇద్దరూ ఆదోని పట్టణంలో రోజువారీ కూలి పనులు ముగించుకుని బైక్పై తిరిగి గ్రామానికి బయలుదేరారు. అదే సమయంలో కర్ణాటకలోని సిరుగుప్ప నుంచి ఆదోని వైపు కంపాడు బాపురం గ్రామానికి చెందిన శివరమిరెడ్డి (55), ఆదోని చిన్న మార్కెట్ వీధికి చెందిన అయూబ్ కలిసి మరో బైక్పై వస్తున్నారు. మాదిరే గ్రామ క్రాస్ వద్దకు చేరుకోగానే ఈ రెండు బైకులు ఎదురెదురుగా తీవ్ర వేగంతో ఢీకొన్నాట్లు సమాచారం.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

