ఎల్‌ఎల్‌సీ ద్వారా సాగునీరు ఇవ్వకపోతే కలెక్టరేట్ ముట్టడి: ఎర్రకోట రాజీవ్ రెడ్డి హెచ్చరిక

కర్నూలు జిల్లా ​ఎమ్మిగనూరు లో ఖరీఫ్ పంటలకు ఎల్‌ఎల్‌సీ ద్వారా వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో భారీ ‘రైతు పోరుబాట’ ర్యాలీ నిర్వహించారు. ​స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి ప్రారంభమైన ర్యాలీ వైయస్సార్ సర్కిల్, అంబేద్కర్ సర్కిల్ మీదుగా ఎల్‌ఎల్‌సీ కార్యాలయం వరకు సాగింది. అనంతరం రైతుల సమస్యలపై ఎల్‌ఎల్‌సీ డీఈఈ (PVP సబ్ డివిజన్) కార్యాలయంలో సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు.

ర్యాలీ నిర్వహిస్తున్న వైసిపి నాయకులు

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తుంగభద్ర డ్యామ్‌లో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ రాయలసీమ వాటా కింద ఖరీఫ్ పంటలకు నీరు విడుదల చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎరువులు, విత్తనాల కోసం భారీగా పెట్టుబడులు పెట్టామని, సరైన సమయంలో నీరు అందకపోతే పంటలు ఎండిపోయి రైతులు అప్పులపాలయ్యే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎల్‌ఎల్‌సీ కాలువ ద్వారా సాగునీరు విడుదల చేయకపోతే కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఎర్రకోట రాజీవ్ రెడ్డి హెచ్చరించారు.

పోరు బాట పట్టిన వైసిపి నాయకులు

​ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా పరిశీలకులు తేర్నికల్ సురేంద్ర రెడ్డి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు బి.ఆర్. బసి రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న వైసిపి నాయకులు
Back To Top