కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాల్మీకి నగర్లో పోలీసులు శుక్రవారం విస్తృతంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ జి. వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్, టూ టౌన్ సీఐ, త్రీ టౌన్ సీఐ, తాలూకా సీఐలతో పాటు ఇద్దరు ఎస్సైలు, 25 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
◆ రౌడీ షీటర్ల ఇళ్ల సోదాలు: పరిసర ప్రాంతాల్లోని రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్ల నివాసాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ◆ నాటుసారా పట్టివేత: అక్రమ మద్యం, నాటుసారా విక్రేతలపై నిఘా ఉంచి తనిఖీలు చేపట్టగా, శేఖర్ అనే వ్యక్తి ఇంట్లో 10 లీటర్ల నాటుసారా లభ్యమైంది. సారాను స్వాధీనం చేసుకుని, నిందితుడిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ◆ వాహనాల తనిఖీ: కాలనీ పరిధిలో సుమారు 25 ద్విచక్ర వాహనాలను తనిఖీ చేసి, సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనదారులకు జరిమానా విధించారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారిపై నిరంతరం నిఘా ఉంటుందని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.