కర్నూలు జిల్లా అదోని ఆర్డీవో కార్యాలయం ఎదుట న్యాయవాదులు శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ధర్నా నిర్వహించిన అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో శాశ్వత హైకోర్టు లేదా శాశ్వత హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని ఆదోని బార్ అసోసియేషన్ డిమాండ్ చేశారు. రాయలసీమ వ్యాప్తంగా ఉన్న బార్ అసోసియేషన్ల పిలుపు మేరకు మూడు రోజుల పాటు (ఆగస్టు 19 నుండి 21 వరకు) కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు న్యాయవాదులు ప్రకటించారు.
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. కర్నూలులో శాశ్వత బెంచ్‌కు బదులుగా సర్క్యూట్ బెంచ్ ఏర్పాటు చేయాలనే ఆలోచనను న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. అప్పుడప్పుడు వచ్చిపోయే సర్క్యూట్ బెంచ్ వల్ల రాయలసీమ ప్రజలకు, కక్షిదారులకు ఎటువంటి ప్రయోజనం ఉండదని వారు స్పష్టం చేశారు. ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన నాటి శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం న్యాయ రాజధానిగా కర్నూలులోనే పూర్తి స్థాయి హైకోర్టును ఏర్పాటు చేయాలని వారు గుర్తుచేశారు. రాయలసీమ ప్రాంతం ఎప్పటినుంచో తీవ్ర వెనుకబాటుతనానికి గురవుతోందని, గత ప్రభుత్వాలు, ప్రస్తుత పాలకులు ఇచ్చిన హామీలను వెంటనే నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆదోని బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హాజీ, న్యాయవాదులు అనిత, కలందర్ బాషా, కే. విజయభాస్కర్ రెడ్డి, హుసేన్ సాని తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.