ఆదోని రూరల్ (కర్నూలు జిల్లా): మండల పరిధిలోని నెట్టేకల్ గ్రామ సమీపంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో గంగాధర్ సింగ్ (25) అనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మార్కాపురం పట్టణానికి చెందిన గంగాధర్ సింగ్ నెట్టేకల్ గ్రామంలోని తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు బయలుదేరాడు. ఈ క్రమంలో నెట్టేకల్ గ్రామ సమీపంలోని ఓ మలుపు వద్దకు చేరుకోగానే వాహనం అదుపుతప్పడంతో రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడిపోయి అతడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు.
స్థానికుల సమాచారంతో ఆదోని తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యువకుడి మృతితో అతడి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.