కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడం అన్యాయమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె. లింగన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీలో నిధులు లేవనే నెపంతో కార్మికుల జీతాలు నిలిపివేయడంతో వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంచాయతీ పరిధిలోని స్వీపర్లు, వాటర్‌మెన్లు తదితర సిబ్బందికి 4 నెలల నుంచి 10 నెలల వరకు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అరకొర వేతనాలతో పనిచేసే కార్మికులకు నెలల తరబడి జీతాలు ఇవ్వకపోతే వారు ఎలా జీవించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం, అధికారులు తక్షణమే స్పందించి బకాయిలను విడుదల చేయాలని కోరారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే ప్రత్యేక చొరవ తీసుకొని, గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి కార్మికుల కడుపు నింపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ (DYFI) మండల ఉపాధ్యక్షులు చిరంజీవి, పంచాయతీ కార్మికులు మరియు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.