వినతిపత్రాన్ని సచివాలయ తలుపులకే అతికించి నిరసన

■​10 రోజులకొకసారి మంచినీళ్లు.. రోడ్లు, డ్రైనేజీలు లేక నరకయాతన ■ సచివాలయ తలుపులకు వినతిపత్రం అతికించిన కెవిపిఎస్‌, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు

ఆదోని (కర్నూలు జిల్లా): ఆదోని మండలం బసరకోడు గ్రామంలోని దళిత కాలనీవాసులు మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే అక్కడ సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

వినతిపత్రం అందజేయడానికి వస్తే తాళం వేసి ఉన్న గ్రామ సచివాలయం

​మంగళవారం దళిత కాలనీలో పర్యటించిన వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు ఉచ్చిరప్ప, కేవీపీఎస్ మండల అధ్యక్షుడు మునిస్వామి, నాయకుడు రామాంజనేయులు స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ.. కాలనీలో రోడ్లు, మురుగునీటి పారుదల వ్యవస్థ లేక రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కనీసం పది రోజులకు ఒకసారి కూడా తాగునీరు అందడం లేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు.

యూట్యూబ్ వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

అధికారుల నిర్లక్ష్యంపై నిరసన: స్థానిక సమస్యలపై అధికారులకు వినతిపత్రం అందజేసేందుకు ఉదయం 10:40 గంటలకు గ్రామ సచివాలయానికి వెళ్లగా, అప్పటివరకు ఏ ఒక్క అధికారీ కార్యాలయానికి రాలేదని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల సమయపాలన తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ, వినతిపత్రాన్ని సచివాలయ తలుపులకే అతికించి నిరసన తెలిపారు. పాలకులు, అధికారులు స్పందించి దళిత కాలనీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.