కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్లు గ్రామంలో దళితులకు స్మశాన వాటిక సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ప్రభుత్వం స్పందించి భూమి కేటాయించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గ్రామ సచివాలయ కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గ్రామంలో దళిత సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలు నిర్వహించడానికి సరైన స్మశాన స్థలం లేక దళితులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 1235 ప్రకారం ప్రభుత్వం వెంటనే స్పందించి భూమిని కొనుగోలు చేసి, స్మశాన వాటికకు కేటాయించాలని కోరారు. దళితుల దశాబ్దాల సమస్యను అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే. లింగన్న, సీఐటీయూ మండల అధ్యక్షులు రామాంజనేయులు, రైతు సంఘం మండల నాయకులు శేఖర్, డీవైఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు చిరంజీవిలతో పాటు ప్రజా సంఘాల నాయకులు, దళిత కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.