కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ సైన్స్ కాలేజీ మైదానం లో జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఉత్సాహపూరిత వాతావరణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలోని అండర్–14, 16, 18, 20 విభాగాల నుంచి దాదాపు 1,200 మంది బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొన్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్, టీడీపీ యువ నాయకులు మారుతీ నాయుడు మాట్లాడుతూ, క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరిస్తూ నిజమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. క్రీడలు యువతలో శారీరక దృఢత్వాన్ని, క్రమశిక్షణను పెంపొందించి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తాయని పేర్కొన్నారు.

ఈ ఎంపిక పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు అక్టోబర్ 2 నుంచి 4 వరకు ఆదోని ఆర్ట్స్ & సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఆదోని డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి (డివైఈఓ) రాజేంద్రప్రసాద్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ అయ్యప్ప, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి, అసోసియేషన్ మాజీ కార్యదర్శి హర్షవర్ధన్, పెద్దకడబూరు ఎంఈఓ–2 రామమూర్తి, కళాశాల పీడీ ఎర్రిస్వామి, అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
