అప్రకటిత కరెంటు కోతలను నిరసిస్తూ సీపీఎం రాస్తారోకో

కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని గణేకల్లు విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో గత నాలుగు రోజులుగా విధిస్తున్న అప్రకటిత కరెంటు కోతలను నిరసిస్తూ ఆదివారం రాత్రి సీపీఎం ఆధ్వర్యంలో సబ్ స్టేషన్ ముందు ఆదోని-మాధవరం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

ఆందోళన నిర్వహిస్తున్న గ్రామస్తులు సిపిఎం నాయకులు

ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి లింగన్న, కార్యదర్శి వర్గ సభ్యులు వీరారెడ్డి, డి. రామాంజనేయులు, జె. రామాంజనేయులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని చెబుతున్న ప్రభుత్వం, రాత్రివేళల్లో ముందస్తు సమాచారం లేకుండా కోతలు విధించడం దారుణమన్నారు. రాత్రిపూట కరెంటు లేకపోవడంతో చిన్నపిల్లలు, బాలింతలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యపై విద్యుత్ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కోతలు ఎత్తివేయకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం నాయకులు విరూపాక్ష, గోవిందు, హనీఫ్ బాషా, చిరంజీవి, వీరేష్, రామకృష్ణలతో పాటు గణేకల్లు, పాండవగల్ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.