News
ఒక్కసారే అవకాశం.. ఇది వరకులా ఎక్కువ ఛాన్స్‌లు ఉండవ్.. సీఎం చంద్రబాబు
ఏ అధికారి ఎక్కడ సరిపోతారో వారినే అక్కడ నియమించామని భావిస్తున్నాను. అందుకోసం చాలా కసరత్తు చేశాం. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను.
బాగా పనిచేస్తే ప్రోత్సహిస్తా… లేకపోతే కొత్తవారిని చూసుకుంటా
కేంద్రం నుంచి వీలైనంతగా నిధులు తేవడంపై దృష్టి పెట్టండి
అధికారులకు సీఎం స్పష్టీకరణ
బుధవారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. పాల్గొన్న మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నిమ్మల రామానాయుడు, అనిత, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, లోకేశ్, కొల్లు రవీంద్ర..
అమరావతి: ఏ అధికారి ఎక్కడ సరిపోతారో వారినే అక్కడ నియమించామని భావిస్తున్నాను. అందుకోసం చాలా కసరత్తు చేశాం. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరు నన్ను నమ్మండి. కలిసి ముందుకెళదాం. అంచనాల్ని అందుకునేలా అందరూ పనిచేయాలి.
గతంలో కొందరు అధికారుల పనితీరు అంత బాగా లేకపోయినా, ఫలితాలు కనిపించకపోయినా చూసీచూడనట్లు ఉండేవాడిని. మరిన్ని అవకాశాలు ఇచ్చేవాడిని. ఇకపై అలా ఉండదు. అధికారుల పనితీరు ఎప్పటికప్పుడు సమీక్షిస్తాను.
ఒకసారే అవకాశమిస్తాను. దాన్ని అందిపుచ్చుకుని బాగా పనిచేసినవారిని మరింతగా ప్రోత్సహిస్తాను. పని చేయనివారికి థ్యాంక్స్ చెప్పేసి కొత్తవారిని చూసుకుంటాను’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టంచేశారు.

బుధవారం సాయంత్రం ఆయన మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో సమావేశమయ్యారు. చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక.. అధికారులతో ఇంత విస్తృత స్థాయిలో సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి.
వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్న తీరు, ప్రాధాన్యతలను ఆయన స్పష్టంగా తెలియజేశారు. అధికారుల నుంచి ఎలాంటి పనితీరు ఆశిస్తున్నదీ విస్పష్టంగా చెప్పారు.
పనులు చేయడానికి డబ్బుల్లేవని చెప్పొద్దని, నిధులులేకుండానే చేసే పనులు చాలా ఉంటాయని, వాటిపై దృష్టి పెట్టాలని ఆయన తెలిపారు.
కేంద్రం నుంచి వీలైనన్ని మార్గాల్లో నిధులు తెచ్చుకోవాలి
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో వివిధ శాఖలకు కేటాయించిన నిధుల్లో రాష్ట్రానికి ఏ మేరకు తెచ్చుకోగలమన్నదానిపై ఆయా విభాగాల అధికారులు ప్రణాళికలు రూపొందించుకోవాలని చంద్రబాబు తెలిపారు. *వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్), ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో (పీపీపీ) చేపట్టే ప్రాజెక్టులు… ఇలా కేంద్రం నుంచి ఎలా వీలైతే అలా నిధులు రాబట్టుకోవడమే ప్రధాన లక్ష్యం కావాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు, మూడు నెలల్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఆ కోణంలోనే ఉండాలన్నారు.
కేంద్రం నుంచి శాఖల వారీగా రాష్ట్రానికి అవసరమైన సాయం తెచ్చుకునేందుకు ఇప్పటికే ఎంపీలు, మంత్రులతో బృందాన్ని ఏర్పాటు చేశామని.. రాష్ట్రస్థాయిలో మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులు ఒక బృందంగా పనిచేస్తూ, ఎంపీలతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు.
అధికారులు మానవీయ కోణంలో పనిచేయాలి.
అధికారులు అన్ని సార్లూ రూల్స్ పట్టుకుని వేళ్లాడటం సరికాదని, కొన్ని సందర్భాల్లో ప్రజలకు మేలు చేసేందుకు మానవీయ కోణంలో ఆలోచించాలని చంద్రబాబు సూచించారు.

ఓట్లు వేరు. ప్రజలకు మంచి చేయడం వేరు. ప్రతి పనికీ రాజకీయ ప్రయోజనం ఉండకపోవచ్చు.
కానీ మంచి చేశామనే తృప్తి ఉంటుంది. నన్ను అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు అంత మంది రోడ్డెక్కడానికి కారణం… అంతకు ముందు నేను చేసిన మంచే. మంచి చేస్తే ప్రజలు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. ప్రజలు సాయం కోరి వస్తే.. దాన్ని ఎలాగైనా పరిష్కరించేలా అధికారుల ఆలోచనలు ఉండాలి.
బ్యూరోక్రటిక్ కోణంలో కాకుండా మానవీయ కోణంలో పనిచేయాలి’ అని స్పష్టం చేశారు.
పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యం
రాబోయే ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ), పేదరిక నిర్మూలనకు ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజా భాగస్వామ్యం (పీ4) విధానాల్ని అనుసరిస్తామని చంద్రబాబు తెలిపారు.

1995లో ఇంజినీరింగ్ కాలేజీల్ని నెలకొల్పాలి ఆనుకున్నప్పుడు ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే… ప్రైవేటు రంగంలో ప్రోత్సహించామని గుర్తు చేశారు. అప్పట్లో ఆ చొరవ తీసుకోబట్టే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచం నలుమూలలా వేల సంఖ్యలో సాఫ్ట్‌వేర్ నిపుణులు ఉన్నారని తెలిపారు. సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న 1-2 శాతం మంది, అట్టడుగున ఉన్న 10 శాతం మందికి చేయూతనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, పీ4 విధానంలో దానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, రౌడీలను అణచివేస్తామని, గంజాయి ఆనవాళ్లే లేకుండా చేస్తామని తెలిపారు. ఈ విషయంలో అధికారులు సమర్థంగా పనిచేయాలని కోరారు.
నేను పరిగెడితే చాలదు… మీరూ పరిగెత్తాలి..!

రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అధికారులు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని చంద్రబాబు సూచించారు. సమస్యల్ని తీసుకుని పరిష్కారం కోసం తన వద్దకు రావడం సరికాదని, పరిష్కారం కూడా వారే ఆలోచించుకుని రావాలన్నారు. ఇది వరకు తాను మాత్రమే పరిగెత్తేవాడినని, ఇప్పుడు మంత్రులు, అధికారులు కూడా పరుగు పెట్టాలని ఆయన స్పష్టంచేశారు. మళ్లీ 1995నాటి చంద్రబాబును అప్పటి పాలనను చూస్తారని ఆయన తెలిపారు. అప్పట్లో తనతో పనిచేసినవారెవరైనా ఉన్నారా అని ఆయన ప్రశ్నించగా… ముగ్గురు, నలుగురు చేతులెత్తారు. ‘ఏ కార్యక్రమానికైనా నిధుల్ని ఎలా సమకూర్చుకోవాలన్న ప్రణాళికతో రండి. నా దగ్గరకు వచ్చాక దానిపై చర్చిస్తూ సమయం వృథా చేయొద్దు’ అని ఆయన పేర్కొన్నారు. ఇకపై తనతో సమావేశాలు కూడా గంట వ్యవధికి మించవని, నిర్ణయాత్మకంగా ఉంటాయని స్పష్టంచేశారు.

చెల్లించాల్సిన బకాయిలు, బిల్లులు రూ.లక్ష కోట్లు!
వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన విధ్వంసం వల్ల రాష్ట్ర విభజననాటికంటే దారుణమైన పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. చెల్లించాల్సిన బిల్లులు, బకాయిలు రూ.లక్ష కోట్ల వరకు ఉన్నాయన్నారు. కేంద్రం ఆక్సిజన్ అందిస్తే తప్ప ముందుకెళ్లలేని పరిస్థితి కనిపిస్తోందని తెలిపారు. ‘రాష్ట్రానికి సాయం చేయడానికి కేంద్రం ముందుకు వచ్చింది. పోలవరం, అమరావతితోపాటు, వెనుకబడిన జిల్లాలకు నిధులిస్తామని చెప్పింది. ఇది మంచి పరిణామం. రాయలసీమలో పారిశ్రామిక కారిడార్‌కు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది’ అని పేర్కొన్నారు. ‘గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోలేకపోయాం. నేను కేంద్ర మంత్రుల వద్దకు వెళితే.. గత ప్రభుత్వం కనీసం యుటిలిటీ సర్టిఫికెట్లు కూడా ఇవ్వలేదని, నిధులు దారి మళ్లించిందని చెప్పారు’ అని తెలిపారు.

News
సహకార ఉద్యోగుల సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం బాసట
ఆదోని, ఫిబ్రవరి 21:ఆదోనిలోని డి.సి.సి.బి (DCCB) బ్యాంక్ ఎదుట తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సహకార సంఘాల ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం శనివారం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సమ్మె శిబిరాన్ని సందర్శించిన సంఘం నాయకులు ఉద్యోగుల పోరాటానికి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె. లింగన్న, మండల కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు:
- వ్యవసాయానికి వెన్నెముక: గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి సాగు పెట్టుబడి నుంచి ఇతర సేవల వరకు ప్రాథమిక సహకార సంఘాలు ఎంతో మేలు చేస్తున్నాయని వారు కొనియాడారు.
- ప్రభుత్వ బాధ్యత: సహకార వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా, వాటిని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు గుర్తు చేశారు.
- తక్షణ పరిష్కారం: గత కొంతకాలంగా తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు శాంతియుతంగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. వారి న్యాయమైన కోర్కెలను వెంటనే ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సహకార సంఘాల ఉద్యోగులు, కార్మిక సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
News
పోగొట్టుకున్న బ్యాగ్‌ను పోలీసులు ఒకే ఒక్క గంటలో రికవరీ
ఆదోని, ఫిబ్రవరి 18:
ప్రయాణంలో అజాగ్రత్తగా వదిలేసిన లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఆదోని వన్ టౌన్ పోలీసులు కేవలం ఒకే ఒక్క గంటలో రికవరీ చేసి బాధితురాలికి అప్పగించారు. పోలీసుల వేగవంతమైన స్పందనపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
అసలేం జరిగిందంటే? కౌతాలం నుంచి ఆదోనికి ఆర్టీసీ బస్సులో వచ్చిన ఓ మహిళ, విశాల్ మార్ట్ వద్ద దిగుతూ తన బ్యాగును బస్సులోనే మరిచిపోయింది. ఆ బ్యాగులో 6 లక్షల రూపాయల విలువైన 4 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. అయితే, ఆ తొందరలో తన వెంట తెచ్చుకున్న బ్యాగును బస్సులోనే మరిచిపోయారు. కొద్దిసేపటి తర్వాత బ్యాగు గుర్తుకు రావడంతో హుటాహుటిన బస్టాండ్‌కు చేరుకుని డ్రైవర్‌ను సంప్రదించారు. బస్సులో వెతికినప్పటికీ బ్యాగు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన బాధితురాలు సాయంత్రం 3:30 గంటలకు ఆదోని వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ గారికి ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు.. బాధితురాలి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన పోలీసులు బస్సు డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు విచారణ చేపట్టారు. పలు ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గాలింపు చేపట్టారు. సాయంత్రం 4:30 గంటలకు పోగొట్టుకున్న సొత్తును తిరిగి పొందిన బాధితురాలు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
News
నాటు సారా స్థావరంపై పోలీసుల దాడి
ఆదోని రూరల్, ఫిబ్రవరి 18:
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా ఆదోని డీఎస్పీ శ్రీ హేమలత సూచనల మేరకు, రూరల్ సీఐ నల్లప్ప పర్యవేక్షణలో బుధవారం పెద్దతుంబలం పోలీసులు భారీ దాడులు నిర్వహించారు.
ఘటన వివరాలు:
పెద్దతుంబలం ఎస్ఐ విద్యా శ్రీ, తన సిబ్బంది రంగస్వామి (PC-3603), రామకృష్ణ (PC-3637)లతో కలిసి దొడ్డనగిరి గ్రామ శివార్లలోని సిద్ధాపురం ఆంజనేయస్వామి గుడి సమీపంలో ఉన్న గుట్టల వద్ద తనిఖీలు చేపట్టారు. అక్కడ గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న నాటు సారా బట్టిని పోలీసులు గుర్తించారు. పోలీసుల రాకను గమనించిన నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు.
భారీగా ఊట ధ్వంసం:
పోలీసులు సారా బట్టి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అక్కడ నిల్వ ఉంచిన ఊటను తక్షణమే ధ్వంసం చేశారు. అలాగే, ప్లాస్టిక్ క్యాన్లలో నిల్వ ఉంచిన 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
నిందితుడి గుర్తింపు:
పోలీసుల ప్రాథమిక విచారణలో, సారా బట్టి నిర్వహిస్తున్న వ్యక్తి ఆదోని పట్టణానికి చెందిన నాగరాజు కుమారుడు బోయ శివగా తేలింది. స్థానిక పొలాల యజమానుల నుంచి సేకరించిన సమాచారం మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విద్యా శ్రీ తెలిపారు. అక్రమ మద్యం తయారీ మరియు రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

-
News2 weeks agoవ్యాధి నయం కావడం లేదన్న బెంగతో ఆత్మహత్య
-
News2 weeks agoహత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు
-
News2 weeks agoఅదోనిలో అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తులు అరెస్ట్
-
News2 weeks agoపోగొట్టుకున్న బ్యాగ్‌ను పోలీసులు ఒకే ఒక్క గంటలో రికవరీ
-
News2 weeks agoమహిళా భద్రతపై అవగాహన సదస్సు
-
News1 week agoసహకార ఉద్యోగుల సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం బాసట
-
News2 weeks agoనాటు సారా స్థావరంపై పోలీసుల దాడి
