ఆదోని: కర్నూలు జిల్లాతో పాటు ఆదోని ఉమ్మడి మండలాన్ని తక్షణమే కరువు ప్రాంతంగా ప్రకటించి, సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మండల కార్యదర్శి వర్గ సభ్యులు బి. వీరారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా, మండల స్థాయి నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె. వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి కె. లింగన్న మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం వల్ల సరైన వర్షాలు లేక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ఇంతటి తీవ్ర పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం విత్తనాలు, ఎరువుల ధరలను పెంచి రైతులపై అదనపు భారం మోపిందని వారు విమర్శించారు.

ప్రధాన డిమాండ్లు: ★ పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 50,000 నష్టపరిహారం చెల్లించాలి. ★ బ్యాంకుల్లోని వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేయాలి. ★ ఉపాధి హామీ పనిదినాలను 200 రోజులకు పెంచి, రోజువారీ వేతనంగా రూ. 700 అందించాలి. ★ అర్హులైన పేద కుటుంబాలకు 14 రకాల నిత్యావసర సరుకులను, పశువులకు అవసరమైన మేతను ఉచితంగా సరఫరా చేయాలి.
ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు జె. రామాంజనేయులు, ఊచ్చిరప్ప, మండల నాయకులు అయ్యప్ప, మునిస్వామి, పాండురంగ, హనుమంత్ రెడ్డి, పట్టణ నాయకులు గోపాల్, తిప్పన్న, శాఖ కార్యదర్శులు హనీఫ్ బాషా, తయన్నతో పాటు వివిధ గ్రామాల కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.