ఆదోని (కర్నూలు జిల్లా): కర్నూలు జిల్లాతో పాటు ఆదోని మండలం–2ను ప్రభుత్వం తక్షణమే కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని సీపీఎం మండల కార్యదర్శి కే. లింగన్న, మండల కార్యదర్శి వర్గ సభ్యులు జే. రామాంజనేయులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధనకై సెప్టెంబర్ 10వ తేదీన ఆదోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. పాండవగల్లు గ్రామంలోని బాలయ్యగారి మూర్తి, కొండగౌని నాగరాజు తదితర రైతుల పొలాలను పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక పంటలన్నీ ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు ఎకరాలు సాగు చేసిన కౌలు రైతు నాగరాజు లక్ష రూపాయల పెట్టుబడి పెట్టినా, కనీసం కౌలు కూడా తిరిగిరాని దుస్థితి నెలకొందని పేర్కొన్నారు.

సీపీఎం ప్రధాన డిమాండ్లు: ★ ఆదోని మండలం–2ను కరువు మండలంగా ప్రకటించి, ఎకరాకు రూ. 50,000 పంట నష్టపరిహారం చెల్లించాలి. ★ అర్హులైన పేద కుటుంబాలకు 14 రకాల నిత్యావసర సరుకులు, కరువు పెన్షన్లు పంపిణీ చేయాలి. ★ ఉపాధి హామీ పనిదినాలను 200 రోజులకు పెంచి, దినసరి వేతనంగా రూ. 700 చెల్లించాలి. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు పాండురంగ, శాఖ కార్యదర్శులు గోవిందు, హనీఫ్ బాషా, మాజీ ఉపసర్పంచ్ తిక్కయ్య, పార్టీ సభ్యులు నర్సిరెడ్డి, భీమాంజి, హనుమంతరెడ్డి, రైతులు చిన్న హనుమంతు, నాగరాజు, బి. మూర్తి, ఉలిగరాజు, గోపాల్ రెడ్డి, అంజనేయ, దేవయ్య, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.