ఆదోని క్రైం: కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఒక అమానవీయ ఘటన తీవ్ర కలకలం రేగింది. తెల్లవారుజామున విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా పారిశుద్ధ్య కార్మికురాలిపై గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా దాడి చేసి, పెట్రోల్ పోసి సజీవదహనానికి యత్నించారు.
ఘటన వివరాలు: ఆదోని మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న నర్సమ్మ (30) ఆదివారం తెల్లవారుజామున స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా రోడ్డు ఊడ్చే పనిలో నిమగ్నమైంది. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న గుర్తుతెలియని మహిళలు ఒక్కసారిగా ఆమెపై దాడికి దిగారు. తప్పించుకునే అవకాశం లేకుండా ఆమె కళ్లలో కారం కొట్టి, వెంటనే వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఆమెపై పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యారు.

నర్సమ్మ కేకలు వేయడంతో గమనించిన స్థానికులు, తోటి కార్మికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేశారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను 108 అంబులెన్స్‌లో హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నర్సమ్మ భర్త రెండేళ్ల క్రితమే మృతి చెందాడు. అప్పటి నుంచి ఆమె మున్సిపల్ కాంట్రాక్ట్ పని చేస్తూ తన ముగ్గురు పిల్లలను పోషించుకుంటోంది. పిల్లలకు పెద్దదిక్కుగా ఉన్న తల్లిపై ఇలాంటి కిరాతక దాడి జరగడంతో కుటుంబసభ్యులు, తోటి కార్మికులు కన్నీరుమున్నీరవుతున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ దాడి వెనుక ఉన్న కారణాలు ఏంటి? పాత కక్షలా లేక మరేదైనా వివాదమా? అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల గుర్తింపు కోసం పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికురాలిపై జరిగిన ఈ దారుణ ఘటనతో పట్టణంలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
