ఆదోని తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

◆ రూ.70 కోట్లతో బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సమగ్ర అభివృద్ధి ◆ త్వరలోనే మరో కొత్త స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటుకు కసరత్తు: ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి వెల్లడి..

కర్నూలు జిల్లా ఆదోని పట్టణ ప్రజల దశాబ్దాల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే తన ప్రధాన లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి స్పష్టం చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంతో పాటు సమీప గ్రామాల దాహార్తిని తీర్చడంలో బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అత్యంత కీలకమని, తుంగభద్ర నుంచి వచ్చే నీటిని ఇక్కడే నిల్వ చేసి సరఫరా చేస్తున్నామని ఆయన వివరించారు. వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు ముందస్తుగా రామ్‌జలాన్ని శుభ్రం చేసి అందుబాటులోకి తేవడంతో ప్రస్తుత నీటి ఎద్దడి సమర్థవంతంగా తప్పిందని పేర్కొన్నారు.

ప్రాజెక్ట్ రిపోర్ట్ ను మీడియాకు చూపిస్తున్న ఎమ్మెల్యే

★ బసాపురం ట్యాంకు కట్టలు దెబ్బతిని నీరు వృథా అవుతున్న అంశాన్ని అసెంబ్లీ వేదికగా ప్రస్తావించడంతో ప్రభుత్వం స్పందించి రూ.70 కోట్లతో శాశ్వత అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది. ట్యాంకు పటిష్టత, ప్రహరీ గోడల నిర్మాణం, నీటి నిల్వ సామర్థ్యం పెంపునకు సంబంధించి నిపుణుల సూచనలతో డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) సిద్ధమైంది. చీఫ్ ఇంజనీర్ పరిశీలన అనంతరం త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. ★ పెరుగుతున్న జనాభా అవసరాల దృష్ట్యా మరో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మంజూరుపై ముఖ్యమంత్రితో చర్చించామని, సానుకూల స్పందన వచ్చిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన స్థల సేకరణ, నివేదికల తయారీ వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు.

ప్రభుత్వానికి పంపిస్తున్న ప్రాజెక్ట్ రిపోర్ట్ నమూనా

బసాపురం, రామ్‌జల జలాశయాల ఆధునికీకరణతో పాటు కొత్త ట్యాంకును నిర్మించి భవిష్యత్ తరాలకు కూడా తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే వాయిస్ వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి