కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని దళిత కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 24వ తేదీ సోమవారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో ముమ్మరంగా ఆటోజాత ప్రచారం నిర్వహించారు.
ఈ ప్రచారం మండల పరిధిలోని పెద్ద తుంబలం, గణేకల్లు, బసరకోడు, సలకలకొండ, దిబ్బనకల్లు, దాణాపురం, నారాయణపురం, చాగి గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మండలంలోని దళిత కాలనీలలో తాగునీరు, స్మశాన వాటికల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని కోరారు. అలాగే పేదలకు భూమి, ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ న్యాయమైన డిమాండ్ల సాధనకై కలెక్టరేట్ వద్ద జరిగే నిరసన కార్యక్రమానికి గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే. లింగన్న, సీఐటీయూ మండల కార్యదర్శి వీరారెడ్డి, కేవీపీఎస్ మండల అధ్యక్షులు మునిస్వామి, రైతు సంఘం మండల కార్యదర్శి అయ్యప్ప, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు ఎం. ఉచ్చిరప్ప, కేవీపీఎస్ నాయకులు రామాంజనేయులు, హుసేని, డీవైఎఫ్ఐ మండల కన్వీనర్ వీరేష్, చిరంజీవి, ప్రజా సంఘాల నాయకులు విరుపాక్షి, హనుమంత్ రెడ్డి, ఖాజా తదితరులు పాల్గొన్నారు.