ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షికి హత్యాయత్నం కేసులో బెయిల్.. మిగతా కేసుల వల్ల జైల్లోనే కొనసాగింపు

ఆదోని: కర్నూలు జిల్లా ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బి. విరూపాక్షికి ఓ హత్యాయత్నం కేసులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు ఆదోని 2వ అదనపు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. అయితే, ఆయనపై నమోదైన మరో రెండు కేసుల్లో ఇంకా బెయిల్ రాకపోవడంతో ప్రస్తుతానికి జైలులోనే కొనసాగనున్నారు.

ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి

ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యే విరూపాక్షి తరఫున ప్రముఖ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. మొత్తం 35 మంది నిందితులుగా ఉన్న ఈ హత్యాయత్నం కేసులో ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు 28 మందికి న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.

మీడియాతో మాట్లాడుతున్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి

మరో రెండు కేసుల వివరాలు: ◆ ఎస్సీ/ఎస్టీ, హత్యాయత్నం కేసు: మరో ఘటనకు సంబంధించి నమోదైన హత్యాయత్నం, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు మొత్తం 48 మంది నిందితులుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి న్యాయవాదులు ఇప్పటికే కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ◆నిర్బంధం, ఆస్తుల ధ్వంసం కేసు: అక్రమ నిర్బంధం, ఆస్తుల ధ్వంసం ఆరోపణలతో నమోదైన మూడో కేసులో ఎమ్మెల్యే సహా 12 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుకు సంబంధించి త్వరలోనే ఆలూరు మేజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేయనున్నట్లు న్యాయవాదులు వెల్లడించారు. మిగిలిన రెండు కేసుల్లో కూడా న్యాయ ప్రక్రియ పూర్తయి బెయిల్ లభిస్తేనే ఎమ్మెల్యే విరూపాక్షి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.

జిల్లా రెండవ అదనపు కోర్టు
Back To Top