కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో రజకుల కులదైవం శ్రీ మడివాల మాచయ్య స్వామి దేవాలయ నిర్మాణానికి బుధవారం (26 ఆగస్టు 2026) ఘనంగా భూమి పూజ నిర్వహించారు. రజక సంఘం ఆహ్వానం మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఆదోని పట్టణ అధ్యక్షుడు బి. దేవా మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్ రెడ్డి రజకుల సంక్షేమానికి నిరంతరం కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. గతంలో ఆయన రజక సంఘం అభివృద్ధి, దేవాలయం మరియు కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం 4.01 ఎకరాల స్థలాన్ని కేటాయించడంతో పాటు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ. 5 లక్షలు విరాళం, ప్రహరీ గోడ (కాంపౌండ్ వాల్) నిర్మాణం కోసం రూ. 15 లక్షల నిధులను సమకూర్చారని గుర్తుచేశారు. భవిష్యత్తులోనూ రజకులకు అన్ని విధాలా అండగా ఉంటామని స్పష్టం చేశారు.
అనంతరం రజక కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ సావిత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోనే తొలిసారిగా ఆదోని రజక సంఘం విజ్ఞప్తి మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నుంచి రూ. 40 లక్షల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ ఆలయ నిర్మాణాన్ని టీటీడీ ఆధ్వర్యంలోనే చేపట్టనున్నట్లు వెల్లడించారు. రజకులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆమె ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రజక సంఘం పట్టణ అధ్యక్షుడు సతీష్, ప్రధాన కార్యదర్శులు చిన్నయ్య, నాగప్ప, జిల్లా అధ్యక్షుడు మూకన్న రాజు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నర్సింలు, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ లోకేశ్వరి, వైఎస్సార్సీపీ నాయకులు చంద్రశేఖర్, ఏరుకుల లక్ష్మన్న, అరుణ్ గౌడ్, నాగరాజ్, వెంకటేష్, రవి, రజక ఉద్యోగ సంఘం ప్రతినిధులు గోవిందప్ప, మల్లయ్య, వీరన్న, రామన్న తదితరులు పాల్గొన్నారు.