విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం.. జిల్లా ఎస్పీ

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో, పూర్తి పారదర్శకంగా జరిగేందుకు అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ తెలిపారు. సోమవారం ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ హాళ్లు, బారికేడింగ్, బందోబస్తు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

కౌంటింగ్ హాల్ వద్ద ఏర్పాట్లు పరిశీలిస్తున్న జిల్లా ఎస్పి

ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ… ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసేందుకు ఆదోని పట్టణంలో సుమారు 350 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ సిబ్బందితో పాటు అభ్యర్థులు, వారి ఏజెంట్లకు ప్రత్యేక ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తామని స్పష్టం చేశారు.

కౌంటింగ్ హాల్ వద్ద ఏర్పాట్లు పరిశీలిస్తున్న జిల్లా ఎస్పి

◆ నిబంధనలు కఠినం – సీసీ కెమెరాల నిఘా: కౌంటింగ్ కేంద్రం లోపలికి సెల్‌ఫోన్లు, పెన్నులు, అనధికార కాగితాలు, ఇతర నిషేధిత వస్తువులను తీసుకెళ్లడంపై పూర్తి నిషేధం విధించినట్లు ఎస్పీ తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌లతో పాటు కౌంటింగ్ హాళ్ల పరిసర ప్రాంతాల్లో అత్యాధునిక సీసీ కెమెరాలతో 24 గంటల నిరంతర నిఘా కొనసాగుతుందన్నారు. ◆ ర్యాలీలకు అనుమతి లేదు: ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఇంకా అమల్లో ఉన్న దృష్ట్యా ఫలితాల అనంతరం ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు, సంబరాలు, బాణాసంచా కాల్చడం, ఊరేగింపులు నిర్వహించడానికి అనుమతి లేదని తేల్చి చెప్పారు. నిబంధనలు అతిక్రమించి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా ముగిసేందుకు అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఏజెంట్లు, స్థానిక ప్రజలు పోలీసు యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఆదోని ఏఎస్పీ జయశర్మ, ఆర్డీఓ అరుణాదేవి, మున్సిపల్ కమిషనర్ నయీం అహ్మద్, స్థానిక సీఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.