కర్నూలు జిల్లా అదోనిలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని సందర్భంగా పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ మున్సిపల్ కార్యాలయం మీదుగా మెయిన్ హాస్పిటల్ సర్కిల్లోని వైఎస్సార్ విగ్రహం వరకు కొనసాగింది. అనంతరం మాజీ ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్ రెడ్డి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.


ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో అసలైన నాయకులు ఇద్దరేనని, వారిలో ఒకరు దివంగత ఎన్టీ రామారావు కాగా, మరొకరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. వారిద్దరూ సొంతంగా పార్టీలు స్థాపించి, ప్రజాబలంతో ముఖ్యమంత్రులుగా ఎదిగిన ధీరులని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు రాజకీయాలతో, ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని, కూటములుగా ఏర్పడి మాత్రమే అధికారంలోకి వచ్చారని విమర్శించారు. చంద్రబాబుకు ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము, ధైర్యం ఎప్పుడూ లేవని, ఇప్పటికైనా సింగిల్‌గా పోటీ చేయగలరా అని ఆయన సవాల్ విసిరారు.

ఈ కార్యక్రమంలో పట్టణ గౌరవాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు దేవా, మైనార్టీ నాయకులు షఫీ, ఫయాజ్ అహ్మద్‌లతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
