కర్నూలు జిల్లా మంత్రాలయంలోని ప్రసిద్ధ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంగళవారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. వీరితో పాటు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుడిసె కృష్ణమ్మ, నాయకులు రాఘవేంద్ర రెడ్డి, శ్రీనివాస రెడ్డి తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు.
మఠం దర్శనానికి ముందుగా ప్రజాప్రతినిధులు గ్రామదేవత మంచాలమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాఘవేంద్ర స్వామి బృందావన దర్శనం చేసుకుని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మఠ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామివారు మంత్రులకు శేషవస్త్రం, ఫలమంత్రాక్షతలు, తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు పలికారు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని స్వామివారిని వేడుకున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అనంతరం మంత్రాలయం మండలం రాచుమర్రి గ్రామంలో ‘పీఎం సూర్యఘర్ యోజన’ పథకం కింద ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్‌ను మంత్రులు, ఎంపీ పరిశీలించారు.