చిరుతపులుల సంచారంతో రైతుల భయాందోళన

కర్నూలు జిల్లా ఆదోని,మంత్రాలయం, ఆలూరు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో చిరుతపులుల సంచారం అధికమవడంతో రైతులు, గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పేర్కొన్నారు. శనివారం ఆయన జిల్లా అటవీ శాఖ అధికారిణి (DFO) తో ఫోన్‌లో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు.

కౌతాళం మండలంలోని గోతులదొడ్డి, కోసిగి మండలం పరిసర ప్రాంతాలు, అలాగే ఆస్పరి మండలం తంగరదోన తదితర ప్రాంతాల్లో చిరుతపులులు తిరుగుతూ పెంపుడు జంతువులు, మేకలు, గొర్రెల మందలపై నిరంతరం దాడులు చేస్తున్నాయని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారని, పొలాల్లోకి వెళ్లడానికి, రాత్రి వేళల్లో బయటకు రావడానికి రైతులు భయపడుతున్నారని ఆయన డీఎఫ్‌వోకు వివరించారు. చిరుతపులుల బారిన పడి పెంపుడు జంతువులు చనిపోతే నష్టపరిహారం ఇవ్వడం ఒక ఎత్తయితే, ప్రజల ప్రాణరక్షణ అంతకంటే ముఖ్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కర్ణాటక, అనంతపురం సరిహద్దుల మీదుగా ఇవి వస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల అనుమతి తీసుకొని తక్షణమే బోన్లు (ట్రాప్ కేజ్‌లు) ఏర్పాటు చేసి చిరుతలను పట్టుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

సంచరిస్తున్న చిరుత పులి ఏఐ ఫోటో

దీనిపై డీఎఫ్‌వో స్పందిస్తూ… ◆ చిరుతల కదలికలను గుర్తించేందుకు ఇప్పటికే కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేసి, నిరంతరం నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.◆ పెంపుడు జంతువులను కోల్పోయిన రైతులకు వెటర్నరీ నివేదిక ఆధారంగా ఒక్కో జీవానికి ₹15,000 నుండి ₹20,000 వరకు నష్టపరిహారం అందజేస్తున్నామని, పరిహారం చెల్లింపులో ఎలాంటి ఆలస్యం లేదని చెప్పారు. ◆ చిరుతలను బంధించేందుకు ఉన్నతాధికారుల (HOD) కు నివేదిక పంపి వెంటనే అనుమతి తెప్పిస్తామని ఆమె ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు.

మూగజీవాలను వేటాడుతున్న చిరుత పులి ఏఐ ఫోటో

చివరగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా అటవీ శాఖ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, పురోగతిని ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని ఆదేశించారు.

Back To Top