కర్నూలు, సెప్టెంబర్ 01: జిల్లాలో అర్హులైన ప్రతి లబ్ధిదారుడి ఇంటి వద్దకే వెళ్లి పారదర్శకంగా ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్లను అందజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి తెలిపారు. సెప్టెంబర్ నెలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 2,33,431 మంది లబ్ధిదారులకు గాను మొత్తం రూ.102.48 కోట్ల రూపాయలను పంపిణీ చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

మంగళవారం గోనెగండ్ల మండల కేంద్రంలోని లక్ష్మీపేటలో కలెక్టర్ స్వయంగా పర్యటించి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. దివ్యాంగులు నవీన్, రాజేష్‌లకు వైకల్య పెన్షన్లు, ఈశ్వరయ్య, జానకమ్మ, చంద్రయ్య, నాగేష్‌లకు వృద్ధాప్య పింఛన్లను ఆమె స్వహస్తాలతో పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పింఛన్ సకాలంలో అందుతోందా, సిబ్బంది ఎవరైనా నగదు డిమాండ్ చేస్తున్నారా లేదా వారి ప్రవర్తన ఎలా ఉందనే విషయాలపై ఆరా తీశారు. పింఛన్ల పంపిణీ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా తొలిరోజే వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని డీఆర్‌డీఏ పీడీని కలెక్టర్ ఆదేశించారు.

మహిళా స్వయం సహాయక సంఘాల యూనిట్ల పరిశీలన : అనంతరం గోనెగండ్లలో మహిళా స్వయం సహాయక సంఘాలు నిర్వహిస్తున్న పలు జీవనోపాధి యూనిట్లను కలెక్టర్ తనిఖీ చేశారు. ◆ పిండి మర కేంద్రం: పీఎంఎఫ్‌ఎంఈ (PMFME) పథకం ద్వారా స్వయం సహాయక సంఘం సభ్యురాలు షేక్ ఫాతిమా ఏర్పాటు చేసుకున్న పిండి మర కేంద్రాన్ని పరిశీలించారు. ◆ చీరల వ్యాపార కేంద్రం: ప్రభుత్వ రుణ సహాయంతో మహిళలు నిర్వహిస్తున్న చీరల దుకాణాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ◆ పేపర్ కటింగ్ యూనిట్: పీఎంఈజీపీ (PMEGP) పథకం కింద సానియా సంఘం మహిళలు నడుపుతున్న పేపర్ కటింగ్ తయారీ కేంద్రాన్ని పరిశీలించి, మహిళల ఆర్థిక స్వావలంబనను ప్రశంసించారు.


ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్ రావు, ఆదోని ఆర్డీవో అరుణాదేవి, ఎంపీడీవో మణిమంజరి, ఇన్‌చార్జ్ తహశీల్దార్ రఘువీర తదితర అధికారులు పాల్గొన్నారు.

