సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లోకి విద్యార్థి సంఘాల నాయకుల ప్రవేశాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) కర్నూలు జిల్లా అధ్యక్షుడు అఖండ డిమాండ్ చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సంక్షేమ నిధులను దోచుకోవడానికే ఈ కుట్రకు తెరలేపారని ఆయన ఆరోపించారు. సర్కులర్‌ను రద్దు చేయకపోతే ‘చలో సంక్షేమ భవన్’ ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని, మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం స్థానిక ఆదోనిలోని ఎమ్మిగనూరు సర్కిల్ వద్ద PDSU ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. విద్యార్థులు కళ్లకు నల్ల గంతలు కట్టుకుని, మోకాళ్లపై కూర్చొని భిక్షాటన చేస్తూ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు.
ఈ సందర్భంగా PDSU జిల్లా అధ్యక్షుడు అఖండ, డివిజన్ అధ్యక్షుడు మల్లికార్జున మాట్లాడుతూ. ■ హామీలు విస్మరించిన కూటమి ప్రభుత్వం: అధికారంలోకి రాకముందు రూ.7,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లిస్తామని, జీవో నెంబర్ 77ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసిందని మండిపడ్డారు. ■సమస్యల నిలయాలుగా హాస్టళ్లు: విద్యార్థులకు సొంత భవనాలు నిర్మించాలని, నిత్యావసర ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచి నాణ్యమైన పోషకాహారం అందించాలని కోరారు. ■ పోరాటాలకు సిద్ధం: గతంలో పేద విద్యార్థులకు అన్యాయం చేసిన జగన్ ప్రభుత్వాన్ని ఏవిధంగా సాగనంపారో, హామీలు నెరవేర్చకపోతే కూటమి ప్రభుత్వానికి కూడా విద్యార్థులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ■ పోస్టుల భర్తీ: హాస్టళ్లలో ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్, కమాటి పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో మండల నాయకులు రసూల్, బసవ, పవన్, విష్ణుముని, హుసేని, వంశీ, శశిధర్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు..