కర్నూలు/ఎమ్మిగనూరు: చేనేత కార్మికుల సంక్షేమం, సంప్రదాయ నేత కళ పరిరక్షణ మరియు మార్కెటింగ్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి, ఎమ్మిగనూరు శాసనసభ్యులు బి.వి. జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మిగనూరులోని కుర్ని ఫంక్షన్ హాల్లో 12వ జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. చేనేత ఉత్పత్తుల స్టాల్స్‌ను తిలకించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… 1905 స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో ప్రతి ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. పర్యావరణహిత ఉత్పత్తులుగా ప్రపంచవ్యాప్తంగా చేనేత వస్త్రాలకు ఆదరణ పెరుగుతోందన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు & ప్రణాళికలు: విద్యుత్ రాయితీ: 3,145 చేనేత కుటుంబాలకు 200 యూనిట్లు, పవర్ లూమ్ యజమానులకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్. పింఛన్ & రుణాలు: 2,707 మంది చేనేత కార్మికులకు నెలకు రూ.4,000 పింఛన్, పీఎం ముద్ర కింద 232 మందికి రూ.1.68 కోట్ల రుణాలు. మార్కెట్ అనుసంధానం: ప్రముఖ బ్రాండ్ “తనేరా” గడిచిన 6-7 నెలల్లో రూ.30 లక్షల విలువైన జిల్లా చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసింది. జిఐ ట్యాగ్ & టెక్స్టైల్ పార్క్: ఎమ్మిగనూరు వస్త్రాలకు భౌగోళిక గుర్తింపు (GI Tag) ప్రక్రియ కొనసాగుతోందని, బనవాసిలో టెక్స్టైల్ పార్క్ మరియు టిడ్కో కాలనీ సమీపంలో 80 సెంట్ల స్థలంలో ‘వీవర్స్ శాల’ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెల్లడించారు.
ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బి.వి. జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… చేనేత కార్మికులను “చేనేత కళాకారులు”గా గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. చేనేత కళాకారులకు అంతర్జాతీయ గుర్తింపు తెస్తాం అని ఎమ్మెల్యే బి.వి. జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు.అగ్గిపెట్టెలో ఇమిడేంత సన్నని చీరలను నేసే ప్రతిభ ఎమ్మిగనూరు కళాకారుల సొంతమని కొనియాడారు. ఎమ్మిగనూరు ఖ్యాతిని పెంచడంలో పద్మశ్రీ మాచాని సోమప్ప చేసిన సేవలను స్మరించుకున్నారు. నేతన్న సేవలో: సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి రూ.25,000 ఆర్థిక సాయం. ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ పార్క్: బనవాసిలోని 77 ఎకరాల ఎంఎస్ఎంఈ పార్కులో 22 ఎకరాలను ప్రత్యేకంగా టెక్స్టైల్ పార్క్ కోసం కేటాయింపు. ఆధునిక సాంకేతికత: తమిళనాడు, కర్ణాటక తరహాలో ఆధునిక మగ్గాలు, డిజైనింగ్ శిక్షణ, వీవర్స్ షెడ్ల ఏర్పాటు. మౌలిక సదుపాయాలు: ఎమ్మిగనూరు పట్టణంలో తాగునీటి పథకంతో పాటు ప్రతి ఇంటికి నాణ్యమైన నీరు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి. రూ.40 లక్షల రుణాల పంపిణీ: కార్యక్రమంలో భాగంగా చేనేత కార్మికుల స్వయం ఉపాధి, ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో రూ.40 లక్షల రుణాల మెగా చెక్కును కలెక్టర్ మరియు ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నాగరాజు, కుర్ని కార్పొరేషన్ చైర్మన్ మిన్నప్ప, చేనేత కళాకారుడు నరసప్ప, బిజెపి ఇన్చార్జ్ నరసింహులు, జనసేన ఇన్చార్జ్ రేఖ గౌడ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య, వివిధ శాఖల అధికారులు, మాస్టర్ వీవర్స్ మరియు చేనేత కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.