రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ఒక్క నెల–ఒక నియోజకవర్గం–నాలుగు పర్యటనలు” కార్యక్రమంలో భాగంగా ఎమ్మిగనూరు పట్టణంలోని ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ హాజరై ప్రజల నుంచి అర్జీలను నేరుగా స్వీకరించారు.
కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కార వేదికలకు వస్తున్న వినతుల్లో అత్యధికంగా రెవెన్యూ, సర్వే శాఖలకు సంబంధించినవే ఉన్నాయని తెలిపారు. వీటికి శాశ్వత పరిష్కారం చూపేందుకు రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలు సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సర్వే నిర్వహించే సమయంలో సరిహద్దు రైతులకు తప్పనిసరిగా నోటీసులు ఇచ్చి వారి సమక్షంలోనే ప్రక్రియ పూర్తి చేయాలని సర్వే శాఖ డిడి అరుణ్ కుమార్ కు స్పష్టం చేశారు.
ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా నిర్ణీత కాలపరిమితిలో సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. 22-ఏ నిషేధిత జాబితా, రీ-సర్వే వివాదాలు, ఇనాం భూముల నమోదు, పట్టా భూముల వ్యత్యాసాలతో పాటు పింఛన్లు, తాగునీరు, విద్యుత్, గృహాల మంజూరుకు సంబంధించిన అర్జీలను పరిశీలించి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో అరుణ దేవి, జిల్లా వ్యవసాయాధికారి వరలక్ష్మి, ఆర్ అండ్ బి ఎస్ఈ మహేశ్వర్ రెడ్డి, డిఆర్డిఏ పిడి శ్రీధర్, డిపిఓ భాస్కర్, ఐసిడిఎస్ పిడి విజయ, గిరిజన సంక్షేమ శాఖ అధికారి సురేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.