కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఒక ఆసక్తికరమైన రాజకీయ ముచ్చట ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి నిర్వహిస్తున్న ప్రజలకోసం మీ పార్థసారథి కార్యక్రమంలో ఒక విచిత్రమైన సంఘటన ఎదురైంది. గత ప్రభుత్వ పథకం పేరును ఎమ్మెల్యే ప్రస్తావించడం.. దానికి ఆయన ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది.
ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి నియోజకవర్గంలో జోరుగా పర్యటిస్తున్నారు. ప్రజల కోసం మీ పార్థసారథి పేరుతో స్థానికంగా తిరుగుతూ ప్రజల సాధకబాధకాలు తెలుసుకుంటున్నారు. అయితే, ఈ పర్యటనలో భాగంగా ఒక మహిళ ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి.. తనకు గత వైసిపి ప్రభుత్వ హయాంలో రావాల్సిన ‘అమ్మ ఒడి’ పథకం రాలేదంటూ తన బాధను చెప్పుకుంది. మహిళ సమస్య విన్న ఎమ్మెల్యే పార్థసారథి.. స్పందిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకం ‘తల్లికి వందనం’ పేరును ప్రస్తావించాల్సింది పోయి.. యథాలాపంగా జగన్ ప్రభుత్వ కాలం నాటి ‘అమ్మ ఒడి’ అనే పదాన్నే వాడేశారు. ఎమ్మెల్యే నోట ‘అమ్మ ఒడి’ అనే మాట రావడాన్ని గమనించిన పక్కనే ఉన్న కూటమి నాయకులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. వెంటనే ఎమ్మెల్యే గారికి దగ్గరగా జరిగి.. “అది అమ్మ ఒడి కాదు సార్.. తల్లికి వందనం అని చెప్పండి” అంటూ మెల్లగా గుర్తు చేసే ప్రయత్నం చేశారు. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. పక్కనున్న నాయకులు సరిచేసే ప్రయత్నం చేయగా.. ఎమ్మెల్యే పార్థసారథి ఏమాత్రం తగ్గకుండా కాస్త ఎటకారంగా సమాధానమిచ్చారు.
“ఆ పేరు (తల్లికి వందనం) ఇంకా ప్రజలకు తెలీదు.. అది ఇంకా అంతగా ప్రజల్లోకి వెళ్లలేదు” అంటూ వ్యాఖ్యానించారు. సొంత కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘తల్లికి వందనం’ పథకంపై.. కూటమి ఎమ్మెల్యేనే ఇలా ఓపెన్‌గా కామెంట్స్ చేయడం ఇప్పుడు ఆదోని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యాఖ్యల తాలూకు వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.