కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని దళిత కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ కుల వివక్ష వ్యతిరేక పోరాట కమిటీ (KVPS), ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ ఎంపీడీఓ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె. లింగన్న, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బి. తిక్కప్ప మాట్లాడారు. మండలంలోని బసరకోడు, ఆరేకల్లు, నారాయణపురం, డాణాపురం, పెద్ద తుంబలం, సంతేకుడ్లూరు తదితర గ్రామాలలోని దళిత కాలనీల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. ముఖ్యంగా డాణాపురం, సంతేకుడ్లూరు, నారాయణపురం గ్రామాల్లో కేవలం దళిత కాలనీలకు మాత్రమే మంచినీటి సరఫరా నిలిపివేయడం వివక్షతకు అద్దం పడుతోందని, ఇది అత్యంత శోచనీయమని మండిపడ్డారు. అలాగే హానవాళ్, చిన్న హరివాణం, పెద్ద హరివాణం, చాగి తదితర గ్రామాల్లో కమ్యూనిటీ హాల్స్, సీసీ రోడ్లు, డ్రెయిన్లు, వీధిలైట్లు ఏర్పాటు చేయాలని వారు కోరారు. దళితుల స్మశాన వాటికలకు స్థలాలు కేటాయించడంతో పాటు అంత్యక్రియల అనంతరం శుభ్రం చేసుకోవడానికి నీటి సదుపాయం కూడా లేకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను వెంటనే మంజూరు చేసి దళిత కాలనీల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి వీరారెడ్డి, అధ్యక్షుడు రామాంజనేయులు, రైతు సంఘం మండల కార్యదర్శి అయ్యప్ప, కేవీపీఎస్ మండల అధ్యక్షుడు మునిస్వామి, ఉపాధ్యక్షుడు పరమేష్, డ్యాఫై (DYFI) మండల ఉపాధ్యక్షుడు చిరంజీవి, డప్పు కళాకారుల సంఘం నాయకుడు రామాంజనేయులు, కేవీపీఎస్ నాయకులు అంజి, నాగరాజు, దర్గయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శంకరప్ప, రామప్ప, శ్రీనివాసులు, కె. ఆంజనేయ, రైతు సంఘం నాయకుడు తిక్కన్న తదితరులు పాల్గొన్నారు.