కర్నూలు జిల్లా ఆదోని మండలం డాణపురం గ్రామం ఎస్సీ కాలనీలో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఖాళి బిందెలతో సచివాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించి వెల్ఫేర్ అసిస్టెంట్ గారికి వినతిపత్రం అందజేశారు.
స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినప్పటికీ ఒక దళిత కాలనీకి కనీసం త్రాగునీరు కూడా ప్రభుత్వాలు అందించడం లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే లింగన్న, కెవిపిఎస్ మండల నాయకులు చక్రవర్తి, అంజి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంతమంది నాయకులు వచ్చి హామీ ఇచ్చినా ఇప్పటివరకు తాగునీటి సమస్య పరిష్కారం కాలేదని, వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్యే పార్థ సారథి ని తాగునీటి సమస్య పరిష్కరించండి అంటే మీరే చందాలు వేసుకొని త్రాగునీరు తెచ్చుకోవాలని ఉచిత సలహా ఇచ్చారని ఎమ్మెల్యే నే ఈ విధంగా మాట్లాడితే మా సమస్య ఎలా పరిష్కారం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ఆదోనికి వస్తున్న నారా లోకేష్ మరియు కూటమి నాయకులు వెంటనే స్పందించి గ్రామానికి త్రాగునీరు అందించాలని లేనిపక్షంలో ఖాళీ బిందెలతో కాలనీ ప్రజలు, మహిళలందరూ రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వారు హెచ్చరించారు.