రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించారు. కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని ధనాపురం, నారాయణపురం గ్రామాల్లో ఇటీవల రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం. శివరామకృష్ణ, డాక్టర్ ఎస్. ఐసా పర్వీన్, డాక్టర్ ఎస్. రమాదేవి మరియు అధికారులు రైతులకు పలు కీలక సూచనలు చేశారు.

రైతులకు అవగాహన కలిగిస్తున్న వ్యవసాయ అధికారులు

ప్రత్యామ్నాయ పంటలు: నీటి లభ్యతను బట్టి తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలి. పంట బీమా తప్పనిసరి: ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టాల నుంచి రక్షణ పొందడానికి ప్రతి రైతు తప్పనిసరిగా పంట బీమా చేయించుకోవాలి. తేమ సంరక్షణ: నేలలో తేమను కాపాడుకునే పద్ధతులు పాటించాలి. సమతుల్య ఎరువుల వాడకం, కలుపు నివారణ, సరైన సమయంలో యాజమాన్య చర్యలు చేపడితే దిగుబడి నష్టాన్ని తగ్గించవచ్చు. పత్తి పంటకు స్ప్రే: ఎండ తీవ్రత, బెట్ట పరిస్థితులను తట్టుకోవడానికి పత్తి పంటపై లీటరు నీటికి 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ (13:0:45) లేదా 10 గ్రాముల 19:19:19 నీటిలో కరిగే ఎరువును కలిపి పిచికారీ చేయాలి.హెచ్చరికలను గమనిస్తూ వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తే ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కెవికె అధికారి నిరంజన్, వ్యవసాయ విస్తరణ అధికారి పి. సతీష్, గ్రామ వ్యవసాయ సహాయకులు నళిని, హరి రామ్ మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.

Back To Top
Exit mobile version